News
శభాష్ వెంకటేష్.. ఎస్సైపై సీఎం జగన్ ప్రశంసలు, ఏకంగా మెడల్‌కు సిఫార్సు!
శభాష్ వెంకటేష్.. చాలా బాగా పనిచేశారంటూ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ఎస్సైను అభినందించారు.. సీఎం కూనవరం పర్యటన సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా వెంకటేష్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. గతేడాది, ఇటీవల సంభవించిన వరదల్లో ముంపు బాధితులకు ఆయన అందించిన సేవలను సీఎం గుర్తించారు. దీంతో ఆయనకు ఆగస్టు 15 ప్రభుత్వం ఇచ్చే సేవా పతకాల్లో ఆయన పేరును చేర్చాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసందే.. ఈ క్రమంలో కూనవరం వెళ్లారు. ఆ సమయంలో సభకు హాజరవుతుండగా.. బస్సు దిగారు. అక్కడే ఉన్న స్థానికులు అధికారులు బాగా పని చేశారని సీఎం జగన్‌కు వివరించారు. ఈ క్రమంలో ఎస్సై వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన తీరు.. గతేడాది అయితే దాదాపు 4 నుంచి 5 వేల మంది స్థానికుల్ని తరలించడంలో కీలక పాత్ర పోషించాడని సీఎం జగన్‌తో చెప్పారు. వెంకటేష్ గురించి స్థానికులు చెప్పగానే.. సీఎం జగన్ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. ఎస్సై వెంకటేష్‌కు పోలీస్ మెడల్ ఇవ్వాలని.. ఆయన పేరు చేర్చాలని పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారు. ఎస్సై వెంకటేష్ గోదావరికి వరదలు వచ్చిన సమయంలో బాధితులకు సేవలు అందించారు. గతేడాది వరదల్లో శబరికొత్తగూడెం ప్రాంతంలో స్థానికులతో పాటు దాదాపు 300 పశువులు వరదలో చిక్కుకుపోయాయి. ఈ విషయం తెలియడంతో ఎస్సై వెంకటేష్ ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకుని ప్రమాదకరంగా ఉన్న వరదలో నాటుపడవ వేసుకుని వెళ్లి వారిని రక్షించారు. ఈ ప్రాంతంలోని వరద బాధితులకు సేవలు అందించారు. వరదలో చిక్కుకుపోయిన బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు ఇటీవల వరదల సమయంలో కూడా అప్రమత్తం అయ్యారు ఎస్సై వెంకటేష్. ముందే వరద ప్రభావిత ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వారు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు వరద సమయంలో బాధితులకు అండగా నిలిచిన అధికారుల్ని అభినందించారు. దాదాపు వారం పాటూ అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని ప్రశంసించారు.వరదల సమయంలో ఎవరికి ఏ నష్టం వచ్చినా ఫోటోల కోసమో, అధికార యంత్రాంగం తన చుట్టూ తిరగడం సరికాదన్నారు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి, సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి అలసత్వం లేకుండా సాయం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామ సచివాలయాల నుంచి వాలంటీర్ల వరకు అందరి సాయంతో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పరామర్శ పేరుతో ఫోటోలు దిగి వెళ్లిపోకుండా.. కలెక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బు వారి చేతుల్లో పెట్టి.. వారంతా ప్రతి గ్రామానికి వెళ్లి ఏ ఒక్కరు మిగిలిపోకుండా సాయం అందించారని ప్రశంసించారు. ఒకవేళ ఎవరి ఇల్లు దెబ్బతిన్నా వారికి పరిహారం రాకపోతే దానిని తమ తప్పుగా అంగీకరిస్తామన్నారు ముఖ్యమంత్రి. ప్రతి గ్రామంలో అర్హుల జాబితా, నష్టపోయిన వారి జాబితాలు ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ఎవరికైనా నష్ట పరిహారం రాకపోతే కచ్చితంగా వారికి కూడా న్యాయం చేయడం కోసమే బాధితుల దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. ఏ ఒక్కరికీ సాయం అందలేదు అనే మాట రాకూడదన్నారు.
- Read Latest and