News

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్ సమ్మిట్.. ఏపీ సర్కారుకు పవన్‌ శుభాకాంక్షలు.. రాజకీయాలకంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమంటూ.. | Janasena Chief Pawan Kalyan Sends His Wishes To AP Government Over Visakha Global Investors Summit Telugu News


విశాఖ పెట్టుబడి సదస్సు నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురువారం ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ఆయన ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముహూర్తం దగ్గర పడింది. శుక్రవారం (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే విశాఖ పెట్టుబడి సదస్సు నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురువారం ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ఆయన ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ‘ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశవిదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం.. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి’

విశాఖకు పరిమితం చేయవద్దు..

‘ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం విశాఖకే పరిమితం చేయవద్దు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి. ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. మాకు రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న’ అని వరుస ట్వీట్లు చేశారు పవన్‌ కల్యాణ్‌.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఏపీ వార్తల కోసం  క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button