News
మెడికల్ లీవ్‌లో వెళ్లిన ఎస్సై.. తర్వాతి రోజే ఆత్మహత్య.. కారణం అదేనా..!
మెడికల్ లీవ్‌లో ఉన్న ఓ ఏఆర్ ఎస్సై.. తన వ్యవసాయ పొలం దగ్గర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం బావురుగొండలో జరిగింది. సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సైగా పడిగ శోభన్ బాబు విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. అనారోగ్యానికి గురి కావటంతో మెడికల్ లీవ్ పెట్టిన శోభన్ బాబు నిన్న ఇంటికి వచ్చాడు. ఈరోజు ఉదయం వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లిన శోభన్ బాబు.. ఎవరూలేని సమయంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.అయితే.. శోభన్ బాబుకు నిజంగానే అనారోగ్య సమస్యలున్నాయా.. ఉంటే ఎలాంటి సమస్యలున్నాయి.. అవి అంతగా అతన్ని బాధించాయా.. లేక ఉన్నతాధికారుల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగానే.. భరించలేని ఆనారోగ్య సమస్యలుంటే.. నిన్ననే లీవ్ తీసుకుని వెళ్లి.. ఈరోజే ఆత్మహత్య చేసుకోవటం వెనుక మతలబు ఏంటన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు కుటుంబసభ్యులతో పాటు.. బెటాలియన్‌లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.