News

మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఇలా వచ్చాడు.. అలా తెంపుకుని పారిపోయాడు..నగరంలో వరుస ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతుంది. ఎల్బీనగర్ బైరమల్‌గూడకు చెందిన బాబమ్మ (50) మార్కెట్ వెళ్లి కూరగాయలు తెస్తున్న సమయంలో.. ఓ దుండగుడు నల్ల చొక్కా ధరించి, హెల్మెట్ పెట్టుకుని ద్విచక్రవాహనంపై వచ్చి.. బాబమ్మ మెడలో ఉన్న గొలుసు చూశాడు. వెంటనే బండిని కాసింత దూరంలో స్టాండ్ వేసి నడుచుకుంటూ వెళ్లి వృద్ధురాలి మెడలో ఉన్న 2.2 తులాల బంగారు గొలుసును క్షణాల్లోనే తెంపుకుని తిరిగి బైక్ వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. బాబమ్మ తేరుకుని స్నాచర్‌ను పట్టుకునేందుకు వెంటా పడినప్పటికీ ఫలితం లేకపోయింది. వృద్ధురాలు కావటంతో.. ముందే ఉన్నా పట్టుకోలేకపోయింది. అయితే.. ఘటనా ప్రాతంలోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ తతంగాన్నంతా సినిమా చూసినట్టు చోద్యం చూడటం గమనార్హం. ఇక చేసేదేమీ లేక బాధితురాలు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలో రాచకొండ పరిధిలో ఆరుచోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన వ్యక్తులు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. బైక్ మీద తిరుగుతూ గంట వ్యవధిలోనే ఆరుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఉప్పల్‌లో మొదలుపెట్టిన చైన్ స్నాచర్లు సికింద్రాబాద్‌లోని రామ్ గోపాల్ పేట్‌లో ముగించారు. ఉదయం ఆరున్నర సమయంలో ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో మహిళ మెడలో నుంచి బంగారు చైన్ లాక్కెళ్లారు దొంగలు. అనంతరం కళ్యాణపురిలో మార్నింగ్ వాక్ వెళ్లిన మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్లారు. బాధిత మహిళలు ఇద్దరూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్‌లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న విమల అనే మహిళ మెడలో నుంచి ఐదు తులాల మంగళసూత్రం లాక్కుని పారిపోయారు. ఆ తర్వాత ఓయూలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రామ్‌గోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో మహిళల మెడల్లోంచి గొలుసులు దొంగిలించారు.

  • Read More And

Related Articles

Back to top button