News

మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. బ్రాహ్మణికి RGV పొలిటికల్ అడ్వైజ్



స్కిల్‌డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీటీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న నేపథ్యంలో.. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్లు కురిపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ట్వీట్లతో వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొన్న 9 ప్రశ్నలు, నిన్న 12 ప్రశ్నలు అంటూ టీడీపీ కార్యకర్తలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. నిన్న (సెప్టెంబర్ 16న) రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బ్రాహ్మణి వెంట పెద్ద సంఖ్యలో మహిళలు కదిలారు. కాగా.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు దేవాన్ష్ చదివినా.. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తప్పని చెబుతాడంటూ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని.. త్వరలో లోకేష్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. బ్రాహ్మణి వ్యాఖ్యలపై ఆర్జీవీ తనదైన స్టైల్‌లో స్పందించారు. అయితే.. మొదటిసారిగా నారా బ్రాహ్మణి.. ఏపీ రాజకీయాలపై మాట్లాడటంతో.. ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై ఆర్జీవీ స్పందించారు. స్కిల్ స్కీం కేసులో నారా బ్రాహ్మణికి.. తన భర్త లోకేషో.. మరెవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బ్రాహ్మణి తొందరపడి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే సువర్ణావకాశాన్ని చేజార్చుకోవద్దని వర్మ ఉచిత సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజనులు, తెలుగుతమ్ముళ్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related Articles

Back to top button