News

భలే మంచి కంపెనీ… ఉద్యోగులందరికీ 11 రోజులు సెలవులు.. రీఛార్జ్ అవ్వండంటూ ఆఫర్



ఏ ఆఫీసులో పని చేసే ఉద్యోగిని కదిపినా పని ఒత్తిడి ఎక్కువగా ఉందని వాపోవడం ఇటీవల కామన్‌గా మారింది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రయివేట్ ఉద్యోగం అనే తేడా లేకుండా ప్రతి ఉద్యోగీ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీంతో కొన్ని కంపెనీలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ-కామర్స్ సంస్థ సైతం ఈ కోవలోకే వస్తుంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం మీషో 11 రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీన్ని రెస్ట్ అండ్ రీఛార్జ్ బ్రేక్‌గా ప్రకటించింది. మీషో ఇలా సెలవులు ప్రకటించడం ఇది వరుసగా రెండో ఏడాది కావడం గమనార్హం.

ఈ కామర్స్ సంస్థలకు పండుగ సమయంలో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఉద్యోగులు కూడా అందుకు అనుగుణంగా తీవ్ర ఒత్తిడికి గురి కావాల్సింది. దీని నుంచి బయటపడటం కోసం, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 11 రోజులు సెలవులు ఇస్తున్నట్లు మీషో వెల్లడించింది. మీషో సీటీవో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘వరుసగా రెండో ఏడాది మేం 11 రోజులపాటు కంపెనీ వ్యాప్తంగా బ్రేక్ ప్రకటించాం. రాబోయే పండుగ సీజన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. మీషో ఉద్యోగులు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు విశ్రాంతి తీసుకొని రీఛర్జ్ అవుతారు’ అని సంజీవ్ ట్వీట్ చేశారు. ఈ సెలవులకు ప్రివిలేజ్ లీవ్‌లతో సంబంధం లేదని.. ఫేక్ లీవ్‌లు తాము ఇవ్వమని సంజీవ్ తెలిపారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంతోపాటు ఆర్థిక ఆరోగ్యం పట్ల కూడా తాము శ్రద్ధ వహిస్తామని ఓ నెటిజన్ ట్వీట్‌కు ఆయన బదులిచ్చారు.

ఇంతకు ముందు మీషో ఉద్యోగుల కోసం అనేక మంచి నిర్ణయాలు తీసుకుంది. ‌బౌండరీలెస్ వర్క్‌ప్లేస్ మోడల్, ఇన్‌ఫినిట్ వెల్‌నెస్ లీవ్ (దీర్ఘకాలిక సెలవు), ఆడా మగా అనే తేడా లేకుండా 30 వారాలపాటు పేరెంటల్ లీవ్, 30 రోజుల జెండర్ రీఅసైన్‌మెంట్ లీవ్‌లను మీషో ప్రకటించింది.

Related Articles

Back to top button