News

పాక్‌- జింబాబ్వే మ్యాచ్‌లో మిస్టర్‌ బీన్‌.. రెండు దేశాల అధ్యక్షుల మధ్య ట్విట్టర్‌ వార్‌.. రివేంజ్‌ మాములుగా లేదుగా


టోర్నీ ఫేవరెట్‌గా భావించిన పాకిస్థాన్ జట్టును చిత్తు చేసిన జింబాబ్వే జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా కూడా జింబాబ్వే ఆటగాళ్లకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పసికూన జింబాబ్వే జట్టు ఒక్క పరుగు తేడాతో పటిష్టమైన పాకిస్థాన్ జట్టును మట్టికరిపించి సంచలనం సృష్టించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో బాబర్‌ టీం ఓడిపోయింది. కాగా టోర్నీ ఫేవరెట్‌గా భావించిన పాకిస్థాన్ జట్టును చిత్తు చేసిన జింబాబ్వే జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా కూడా జింబాబ్వే ఆటగాళ్లకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇదంతా బాగానే ఉంది పాక్‌ జట్టును హేళన చేసేలా అతను చేసిన పోస్ట్‌ మాత్రం పాక్‌ అభిమానలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఏకంగా పాక్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌పై స్పందించాల్సి వచ్చింది.

పుంజుకోవడం మాకు బాగా తెలుసు..

వివరాల్లోకి వెళితే పాకిస్థాన్‌పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ట్వీట్ చేసిన అధ్యక్షుడు ఎమర్సన్ దంబుడ్జో ‘జింబాబ్వేకు గొప్ప విజయం సాధించింది. జట్టు యాజమాన్యం, ఆటగాళ్లకు అభినందనలు’ అని రాసుకొచ్చాడు. దీంతో పాటు ‘నెక్ట్స్ టైమ్ రియల్ మిస్టర్ బీన్‌ను పంపండి’ అని ఓ వాక్యాన్ని ట్వీట్‌లో జోడించాడు. ఇదే పాక్‌ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌పై పాక్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ’ అసలు మిస్టర్ బీన్ మాకు లేకపోవచ్చు, కానీ మాకు నిజమైన క్రికెట్ స్ఫూర్తి ఉంది. మా పాకిస్థానీలకు బలంగా పుంజుకునే సరదా అలవాటు ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్‌.. కంగ్రాచ్యులేషన్స్‌. మీ టీమ్ చాలా బాగా ఆడింది’ అని రిప్లై ఇచ్చాడు.

మిస్టర్ బీన్ రాద్దాంతం ఏమిటంటే?

కాగా పాక్‌- జింబాబ్వే మ్యాచ్‌ మధ్యలో మిస్టర్‌ బీన్‌ రావడానికి ప్రధాన కారణం 2016లో జరిగిన ఓ సంఘటన. నివేదికల ప్రకారం, 2016 లో, జింబాబ్వేలోని హరారేలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు ఆసిఫ్ మహ్మద్‌తో ఓ కామెడీ షో నిర్వహించారు. ఇతను చూడడానికి నిజమైన మిస్టర్‌ బీన్‌ (బ్రిటిష్‌ యాక్టర్‌ రోవాన్‌ ఆట్కిన్సన్‌)ను పోలి ఉంటాడు. అయతే హరారేలో జరిగిన షోలో ఇతడి ప్రదర్శన ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయంపై జింబాబ్వే పత్రిక కూడా ఒక సంచలన కథనం ప్రచురించింది. కొంత మంది షో మధ్య నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది. అప్పట్లో ఈ ఫేక్‌ మిస్టర్‌ బీన్‌ జింబాబ్వే వీధుల్లో తిరిగేందుకు పోలీసులు రక్షణ కూడా కల్పించారు. అదేవిధంగా చాలా మంది జింబాబ్వే ప్రజలు.. ఇతడు అసలైన మిస్టర్‌ బీన్‌గా భావించి ఈవెంట్‌ టిక్కెట్లు కొన్నట్లు కూడా వార్తలొచ్చాయి.

Advertisement

ఈ సంఘటనకు సంబంధించి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని జింబాబ్వే భావిస్తోంది. ఈనేపథ్యంలో జింబాబ్వే-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాకముందే ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియాకు ఎక్కారు. మ్యాచ్‌కు ముందు, పాకిస్థాన్ ప్రాక్టీస్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ కోసం జింబాబ్వేకు చెందిన నాగుగి చసుర అనే నెటిజన్ మిస్టర్ బీన్ అంశాన్ని తెరపైకి తెచ్చి బాబర్ టీం ఓడిపోవడం ఖాయమన్నాడు. ‘జింబాబ్వేగా మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించం’ అని ట్వీట్ చేశాడు. ఒకసారి మీరు మాకు నిజమైన మిస్టర్ బీన్‌కు బదులుగా నకిలీ పాక్ బీన్‌ను చూపించారు. రేపటి మ్యాచ్‌లో మేం దీనిని సెటిల్ చేస్తాం అని ట్వీట్ చేశారు. ఇక నిజంగానే పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌ ఓడిపోవడంతో ఈ ట్వీట్ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. చాలా మంది నెటిజన్లు అదే ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘ఫ్రాడ్‌ పాక్‌ మిస్టర్‌ బిన్‌’ బాగా వైరలైంది.

మరిన్ని వరల్డ్ కప్ కథనాల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండిలేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిRelated Articles

Back to top button