News
పవన్ కళ్యాణ్ పిరికివ్యక్తి.. జస్ట్ ఎంటర్టైనర్ మాత్రమే: అంబటి రాంబాబు
జనసేన పార్టీ అధినేత ఓ పిరికివారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి వస్తారంట అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోవాల్సిందే అన్నారు. మోసం చేసే చంద్రబాబుకు, ఆయన మోచేతి నీళ్లు తాగి బతికే పవన్ కళ్యాణ్‌కు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఎవరి అండ లేకుండా సింగిల్‌గా ప్రజల మనస్సు గెలిచిన ధీరుడు సీఎం జగన్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 16 నెలలు జైల్లో పెట్టినా జగన్ భయపడలేదన్నారు. పవిత్రమైన ‘వారాహి’ దేవత పేరు పెట్టుకుని చిందులు వేస్తే, పిచ్చి మాటలు మాట్లాడితే ఆ దేవత కాళ్ల కింద పడి నలిగివడం ఖాయమన్నారు. ఇక, నారా లోకేష్ ఎవరు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేస్తున్నారో ఆయనకే తెలియదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఎంటర్టైనర్ మాత్రమే అని, ఎడ్యుకేటర్ కాదన్నారు.