News

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ కోటా టోకెన్లు విడుదల.. పూర్తి వివరాలివే..!



శ్రీవారి భక్తులకు అధికారులు శుభవార్త వినిపించారు. డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల టోకెన్లు సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అయితే.. అంగప్రదక్షిణకు వెళ్లే భక్తులందరు తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటంటే.. భక్తులు ఒకటవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టోకెన్‌లో పేర్కొన్న రిపోర్టింగ్ టైం ప్రకారం మాత్రమే అక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి లగేజ్ కానీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కానీ తీసుకెళ్లకూడదు. ఈ సేవలో పాల్గొనే భక్తులు కేవలం సాంప్రదాయ దుస్తులే ధరించాల్సి ఉంటుంది. పురుషులైతే ధోతి లేదా ప్యాంట్ మీద టవల్, స్త్రీలైతే చీర, లంగా వోణి లేదా దుపట్టా ఉన్న చుడిదార్ ధరించాలి.అయితే.. భక్తులు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతోనే ఆలయంలోకి వెళ్లాలి. తర్వాత వేరు వేరు లైన్లలో ఆడవారిని, మగవారిని సేవకు పంపుతారు. ముందుగా ఆడవాళ్లు పొర్లు దండాలు పెట్టి బయటకు వచ్చిన తర్వాతే.. మగవారి అంగప్రదక్షిణ మొదలవుతుంది. కాబట్టి ఆడవాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బయట శ్రీవారి బంగారు బావి నుంచి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది. సుప్రభాత సేవ జరిగిన వెంటనే లోపల తోమల సేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు స్త్రీ, పురుషులను వేరువేరుగా దర్శనానికి అనుమతిస్తారు. భక్తులందరూ వారి అంగప్రదిక్షిణం టోకెన్లను కలిగి ఉండాలి. అలాగే బుకింగ్ చేసేటప్పుడు ఉపయోగించిన అదే ఫోటోని ఐడీ ప్రూఫ్‌గా అందించాల్సి ఉంటుంది. సేవ తర్వాత 24 గంటల్లోపు లడ్డు ప్రసాదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. తగిన ఏర్పాట్లు చేసుకుని టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులను టీటీడీ అధికారులు కోరారు.

Related Articles

Back to top button