News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక, పాస్‌లు ఎక్కడిస్తారంటే!



తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరిగింది. అయితే బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజు సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ అందించే పాసులు తీసుకుని అలిపిరి టోల్‌గేటులోకి ప్రవేశించాలని పోలీసులు తెలిపారు. పాసులు ఉన్న వాహనదారులనే అనుమతిస్తామని.. రద్దీని బట్టి ఆయా సమయాలలో మార్పులు ఉండొచ్చని తెలిపారు. ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి తిరుమల ఘాట్‌రోడ్డులోకి బైకులకు అనుమతి లేదన్నారు. బెంగళూరు, చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు ఐతేపల్లి దగ్గర.. మదనపల్లె నుంచి వచ్చేవారు కేఎంఎం కళాశాల వద్ద.. చెన్నై, పుత్తూరు వైపు నుంచి వచ్చే హనాలకు వడమాలపేట టోల్‌ప్లాజా దగ్గర పాసులు ఇస్తారని తెలిపారు. కడప వైపు నుంచి వచ్చే వారికి కుక్కల దొడ్డి దగ్గర, నెల్లూరు, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే వాహనదారులకు మల్లవరం పెట్రోల్‌ బంకు పక్కన, తిరుపతి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కరకంబాడి రోడ్డులోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద పాసులు పొందాలని సూచించారు. గరుడోత్సవం రోజు తిరుమలలో రద్దీని బట్టి చెర్లోపల్లి జంక్షన్‌ దగ్గర.. నంది సర్కిల్‌ వద్ద వాహనాలు నిలిపివేస్తారన్నారు. 22వ తేదీ టౌన్‌ క్లబ్‌ సర్కిల్‌, యూనివర్సిటీ కూడలి, అన్నారావు సర్కిల్‌ వైపు వచ్చే వాహనాల ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని తెలిపారు. 21వ తేదీ మధ్యాహ్నం నుంచి బైకుల్ని పాత చెక్‌ పాయింట్‌, హరే రామ హరే కృష్ణ ఆలయం పార్కింగ్‌ ప్రదేశం, కొత్త నగరపాలిక కార్యాలయం ముందున్న మున్సిపల్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవాలని తెలిపారు.మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుంచి 26వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.విశిష్టత..వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

Related Articles

Back to top button