News
జగన్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. లైన్ క్లియర్ అయినట్లేనా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారంపై కీలక తీర్పు వెలువరించింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, హైకోర్టులో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, రెండు జిల్లాలకు చెందిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి రంగం సిద్ధమైంది. దీంతో హైకోర్టు తీర్పుపై రైతులు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని కోరడంతో న్యాయస్థానం తిరస్కరించింది. ఆర్ -5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లటానికి మార్గం క్లియర్ అయింది. అలాగే, ఈ కేసును కూడా ప్రస్తుతం రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు సీజే వద్ద ఆదేశాలు తీసుకోవాలని ఈ కేసు విచారించిన జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే సమయంలో ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహిత్గీ అమరావతి రైతుల తరఫున వాదించారు.అమరావతి పరిధిలోని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ నెల 18న సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు.