News

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా.. 19 వరకు ఆగాల్సిందే!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు.. మధ్యంతర బెయిల్‌పై విచారణ చేస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదుచేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు అసలు లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో తన పేరు ఎప్పుడు చేర్చారో కనీసం చెప్పలేదన్నారు.తనను ఏ ఆధారాలతో నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా తనను ఈ కేసులోకి లాగారని.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో తనను ఇరికించారన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు. అలాగే మెయిన్ పిటిషన్‌ను తేల్చేలోపు.. మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు ఇవాళ విచారణ చేసింది. బెయిల్‌పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు.. కౌంటర్ దాఖలుకు సీఐడీ తరపు లాయర్ సమయం కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Related Articles

Back to top button