News
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వాహనాన్ని ఢీకొట్టిన లారీ
బీఎస్పీ () రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలోనే ఉన్నారు. ఆ వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం (నవంబర్ 14) సిర్పూర్ నియోజకవర్గం వచ్చారు. కాగజ్‌నగర్ పట్టణ పరిధిలోని పెద్దవాగు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉండగా, వెనుక వైపు నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలిసి బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదమేమీ లేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 118 స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.