News

అదరగొట్టిన కుల్దీప్.. శ్రీలంకపై 41 రన్స్ తేడాతో విజయం, ఆసియా కప్ ఫైనల్‌కు భారత్!



ఆసియా కప్‌ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. స్వల్ప స్కోర్లతో సాగిన మ్యాచులో శ్రీలంకను ఓడించింది. 213 పరుగులను కాపాడుకొని టోర్నీలో ఫైనల్‌ చేరింది! తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 213 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం శ్రీలంకను 172 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 41 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. ఒక దశలో ధనుంజయ డిసిల్వా (41), దునిత్ వెల్లలాగే (42*) అద్భుతంగా పోరాడి.. శిబిరంలో ఆశలు రేకెత్తించారు. అయితే, రవీంద్ర జడేజా ధనుంజయను, షనకను ఔట్ చేసి మ్యాచ్‌ను వైపు తిప్పాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్న అద్భుతమైన క్యాచ్.. మ్యాచ్‌ను మరోసారి మలుపు తిప్పింది. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో అటు బంతితో, ఇటు బ్యాట్‌తో ఆకట్టుకున్న శ్రీలంక యువ ఆటగాడు దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 5 వికెట్లు పడగొట్టి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో పాటు.. 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో స్పిన్నర్ అసలంక 4 వికెట్లు తీయగా.. తీక్షణకు ఒక వికెట్ దక్కింది. మొత్తం 10 వికెట్లూ స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం.అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 213 పరుగులకే ఆలౌట్‌ అయింది. పదికి పది వికెట్లు శ్రీలంక స్పిన్నర్లే తీయడం విశేషం. బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై శ్రీలంక స్పిన్‌ను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే (5/40), చరిత్ అసలంక (4/14) భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. మరి ముఖ్యంగా 20 ఏళ్ల వెల్లలాగే భారత టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.వాస్తవానికి ఈ మ్యాచులో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ (53), శుభ్‌మన్‌ గిల్‌ (19) శుభారంభం అందించారు. దీంతో 11 ఓవర్లలో 80/0 తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచులోనూ 350 స్కోరు సాధించేలా కనిపించింది. అయితే శుభ్‌మన్‌ గిల్‌ తొలి వికెట్‌ రూపంలో వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాను వెల్లలాగే పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్‌ అయింది.ఈ మ్యాచు విజయంతో టీమిండియా ఫైనల్ చేరినట్టే. ఈ నెల 14న జరగనున్న శ్రీలంక – పాకిస్థాన్‌ మ్యాచుతో మరో ఫైనల్‌ బెర్తు ఖరారు కానుంది.

Related Articles

Back to top button