News
అదంతా అబద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అరుణ్ రామచంద్ర పిళ్లై
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. తాను అప్రూవర్‌గా మారలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈడీ అధికారులకు తాను సీఆర్పీసీ 164 కింద ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని తన లాయర్ ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్‌గా మారినట్లు ఇప్పటివరకు మీడియాల్లో వార్తలు తెగ ప్రచారమవుతుండగా.. అవన్ని అబద్ధమని పిళ్లై ఖండించారు. కేసును ప్రభావితం చేసేలా ఈ వార్తలు ఉన్నాయని.. వాస్తవాలకు విరుద్ధమైనవని స్పష్టత ఇచ్చారు పిళ్లై. ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా, బినామీగా వ్యవహరించినట్లు ఈడీ పలు అనుబంధ ఛార్జ్ షీట్లలో పేర్కొన్న నేపథ్యంలో పిళ్ళై గతంలోనూ అప్రూవర్‌గా మారగా.. మళ్లీ తన వ్యాఖ్యలను కోర్టు ద్వారా వెనక్కి తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు అప్రూవర్‌గా మారాడన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలే సంచలనంగా మారగా.. ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఓవైపు ఈడీ నోటీసుల్లో శుక్రవారం విచారణకు హాజరుకావాలని పేర్కొనగా.. దానిపై కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. మరోవైపు తాను అప్రూవర్‌గా మారలేదని చెప్పటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. తనకు వచ్చిన నోటీసులపై లీగల్ టీం ఇచ్చిన సలహా మేరకే తాను నడుచుకుంటానని కవిత చెప్పారు. అలా చెప్పిన గంటల వ్యవధిలోనే అరుణ్ పిళ్లై తరఫున న్యాయవాది ద్వారా అప్రూవర్‌గా మారలేదనే క్లారిటీ రావడం గమనార్హం.